V6 News

షూటర్‎ను పట్టుకున్నం.. వైట్ హౌస్ కాల్పుల ఘటనపై ట్రంప్ ఫస్ట్ రియాక్షన్

షూటర్‎ను పట్టుకున్నం.. వైట్ హౌస్ కాల్పుల ఘటనపై ట్రంప్ ఫస్ట్ రియాక్షన్

వాషింగ్టన్: వైట్‌హౌస్‌ కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమంలో కలకలం రేపిన కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లా్ట్‏ఫామ్ ట్రూత్ సోషల్‎లో పోస్ట్ పెట్టారు. సీఐఏ ఏజెంట్స్, పోలీస్ విభాగం అద్భుతంగా పని చేసిందని ప్రశంసించారు. కాల్పుల సమయంలో భద్రతా సిబ్బంది చాలా వేగంగా, ధైర్యంగా స్పందించారన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని భద్రత సిబ్బంది అదుపులోకి తీసుకున్నాయని తెలిపారు. 

‘‘డీసీలో ఈ సాయంత్రం చాలా అద్భుతంగా గడిచింది. సీక్రెట్ సర్వీస్, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ చాలా గొప్ప పని చేశాయి. చాలా వేగంగా, ధైర్యంగా స్పందించి షూటర్‌ను పట్టుకున్నారు. కాల్పుల ఘటన తర్వాత కార్యక్రమాన్ని కొనసాగిద్దామని అధికారులకు సిఫార్సు  చేశాను. కానీ ఇది పూర్తిగా భద్రతా సిబ్బంది ఇష్టం. దీనిపై త్వరలో వారు ఒక నిర్ణయం తీసుకుంటారు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. 

అసలేం జరిగిందంటే..?

శనివారం (ఏప్రిల్ 25) వాషింగ్టన్ లోని హిల్టన్ హోటల్‎లో వైట్ హౌస్ కరస్పాండెంట్స్‎కు ప్రెసిడెంట్ ట్రంప్ డిన్నర్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ట్రంప్ కుటుంబసమేతంగా హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో సహా సుమారు 2,600 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డిన్నర్ మీట్ కొనసాగుతుండగా ఒక్కసారిగా తుపాకీ కాల్పుల శబ్ధం తీవ్ర కలకలం రేపింది. 

వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రంప్‎ను అత్యవసరంగా హోటల్ నుంచి బయటకు తరలించారు. కాల్పుల శబ్ధంతో భయాందోళనకు గురైన గెస్ట్‎లు టేబుళ్ల కింద దాక్కుకున్నారు. ఘటన స్థలంలో హై అలర్ట్ ప్రకటించిన భద్రతా దళాలు హోటల్‎ను ఆధీనంలోకి తీసుకున్నాయి.

 కాల్పులు జరిపిన నిందితుడిని సెక్యూరిటీ ఫోర్సెస్ చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడు 5 నుంచి 8 రౌండ్ల కాల్పులు జరిగినట్టు గుర్తించారు. ట్రంప్ సహా కీలక నేతలు అంతా సురక్షితంగా ఉండటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు.